న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించేందుకు 15-20 సంవత్సరాలు పడుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ పార్టీ అయినా జాతీయ పార్టీ కావాలంటే 20కోట్ల ఓట్లు రావాలన్నారు. 2019లో ఆమ్ ఆద్మీ పార్టీకి 27లక్షల ఓట్లు వచ్చాయని.. ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే జాతీయ పార్టీలుగా ఆవిర్భవించాయన్నారు. దేశంలో అనేక పార్టీలు ఆ దిశగా ప్రయత్నించాయని, కానీ సాధ్యపడలేదన్నారు. రాత్రికి రాత్రే ఏదీ జరుగదని, దానికి సమయం కావాలన్నారు.
ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. సిద్ధాంతరపరంగా ఏ పార్టీ అయినా జాతీయ పార్టీగా మారొచ్చని, కానీ చరిత్రను పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేరుకోగలిగినట్లు తెలుస్తుందన్నారు. అయితే, అలా మరే పార్టీ చేయలేదని కాదని.. ఇందుకు 15 నుంచి 20 సంవత్సరాల పాటు నిరంతరం కష్టపడాలన్నారు. అలాంటి మార్పు ఒక్క రోజులో జరుగదన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయంపై ప్రశ్నించిన సమయంలో ప్రశాంత్ కిశోర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ.. ప్రజాదరణ అంటే బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోకూడదన్నారు.
ఇందుకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ప్రశాంత్ కిశోర్ ఉదహరించారు. అఖిలేష్ యాదవ్ సభలు సైతం కిక్కిరిసిపోయాయని, ఎన్నికల ఫలితాల్లో ఓటమిని చవి చూడాల్సి వచ్చిందన్నారు. అయితే, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలు లేవా? అని ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ బీజేపీకి 38శాతం ఓట్లు వచ్చాయని, వ్యతిరేకంగా 62శాతం మంది ఓటు వేశారన్నారు. ఈ లెక్కన వంద మందిలో బీజేపీతో కేవలం 38 మంది మాత్రమే ఉన్నారని, ఓటింగ్ సరళి పరంగా ఈ 62 మంది ఒకటికాకపోవడం వల్ల ఒక పార్టీకే లాభం చేకూరుతుందన్న విషయం తెలిసిందేనన్నారు.