పాట్నా: ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట వరకు అక్కడ అంధకారం అలముకున్నది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో ఇద్దరు గర్భిణీలకు డాక్టర్లు ఆపరేషన్ కొనసాగించారు. (Doctors Use Torches To Operate) బీహార్‌లోని జముయి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 11న ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ బ్యాకప్ లోపం వల్ల సుమారు 45 నిమిషాల పాటు కరెంట్ సరఫరా కాలేదు.
కాగా, ఆ ఆపరేషన్ థియేటర్లో అప్పటికే ఇద్దరు గర్భిణీలకు సర్జరీలు నిర్వహిస్తున్నారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులోనే డాక్టర్లు శస్త్రచికిత్సలు కొనసాగించారు. ఆపరేషన్ థియేటర్లో చాలా సేపటి నుంచి కరెంట్ లేదన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు వారు విమర్శించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా దీనిపై ఆందోళన చెందారు.
మరోవైపు ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్నదని జముయి సదర్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ తనేష్ కుమార్ తెలిపారు. విద్యుత్ అంతరాయాలు, బ్యాకప్ వైఫల్యాల నివారణకు తగిన చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.