న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ-ఆప్ వివాదం ఇప్పుడు పోస్టర్లకెక్కింది. శుక్రవారం జరిగిన ఎంసీడీ సమావేశంలో ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగి ముష్టిఘాతాలకు పాల్పడటమే కాక ఒకరిపై ఒకరు బాటిళ్లు విసురుకుని రణరంగాన్ని సృష్టించారు. ఇప్పుడు ఇరు పార్టీలు వాల్‌పోస్టర్ల యుద్ధాన్ని ప్రకటించారు.
తొలుత బీజేపీ 90ల్లల్లో విడుదలైన ఒక సినిమా పోస్టర్‌ను పోలేలా ఖల్నాయిక (లేడీ విలన్) పేరిట విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ ఉన్నారు. దీనికి సమాధానంగా ఆప్ కూడా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘బ్యాలెట్ చోర్ మచ్చాయే షోర్ (బ్యాలెట్ చోరులు రచ్చ చేస్తున్నారు) పేరిట ఉన్న ఈ పోస్టర్లో బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్, మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన రేఖా గుప్తా ఉన్నారు.