తిరువనంతపురం: ఇద్దరు వ్యక్తులు పోలీసులుగా భయపెట్టి, షెల్టర్ హోమ్ నుంచి పారిపోయిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. నిర్భయ షెల్టర్ హోమ్‌లో ఆశ్రయం పొందుతున్న మైనర్ బాలిక శుక్రవారం అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్న ఆమెను ఇద్దరు వ్యక్తులు గమనించారు. దీంతో వారు ఆమె వద్దకు వెళ్లారు. పోలీసులమని చెప్పి ఆ బాలికను భయపెట్టారు. ఒక వ్యక్తికి చెందిన లాడ్జ్ వద్దకు ఆమెను తీసుకెళ్లారు. ఆ బాలికను భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు.
అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులుగా నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడైన బిను, తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్ సమీపంలో లాడ్జ్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడ్ని పుత్తెనపాలెంకు చెందిన విష్ణుగా గుర్తించినట్లు వెల్లడించారు.