లక్నో: ఇటీవల మరణించిన డెంగీ రోగికి ఎక్కించింది మోసంబి జ్యూస్ కాదని అధికారులు తెలిపారు. సరిగా ప్రిజర్వ్ చేయని ప్లేట్లెట్స్ అని వివరించారు. ముగ్గురు సభ్యుల కమిటీ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు ఉత్తర ప్రదేశ్లోని ప్రయోగ్రాజ్ కలెక్టర్ సంజయ్ ఖత్రి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బుధవారం చెప్పారు. కాగా, ప్రయాగ్రాజ్ ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో ఇటీవల 32 ఏళ్ల డెంగీ రోగి ప్రదీప్ పాండే చికిత్స పొందాడు. అయితే అక్కడి వైద్యులు, సిబ్బంది బ్లడ్ ప్లేట్లెట్స్కు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ విషయం తెలిసిందని, అక్కడ అతడు చనిపోయినట్లు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయం వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై చీఫ్ మెడికల్ అధికారి వెంటనే స్పందించారు. దీంతో ఆ ఆసుపత్రికి సీల్ వేశారు. అక్రమ కట్టడం కూల్చివేత గురించి నోటీస్ కూడా జారీ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆ ఆసుపత్రి అధికారులు ఖండించారు. రోగికి ప్లేట్లెట్స్ తగ్గడంతో బయటి నుంచి తెచ్చుకోవాలని అతడి బంధువులకు చెప్పామన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఐదు యూనిట్ల ప్లేట్లెట్స్ను కొని తెచ్చారని వివరించారు. మూడు యూనిట్లు ఎక్కించిన తర్వాత రోగికి రియాక్షన్ రావడంతో ఎక్కించడం ఆపేసినట్లు వెల్లడించారు. రోగికి మోసంబి జ్యూస్ ఎక్కించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కోసం తాము కూడా పూర్తిగా సహకరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.