NTSE | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ‘పరీక్షా పే చర్చా’ అంటూ ‘పీఆర్’ స్టంట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు.. పేద విద్యార్థుల గోడు మాత్రం పట్టట్లేదు. ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా ఆర్థిక చేయూతనందించే ఎన్టీఎస్ఈ ఎగ్జామ్ నిర్వహణకు అవసరమైన నిధులను గడిచిన మూడేండ్లుగా విడుదల చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ఇంగ్లీష్ పత్రిక ‘టెలిగ్రాఫ్’ ఆర్టీఐ పిటిషన్ ద్వారా సేకరించిన వివరాలను బట్టి అర్థమవుతున్నది.
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలనిచ్చి మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో 1963లో నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ)ను ప్రారంభించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణలైన పదోతరగతి, 12వ తరగతి, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు తరగతులను బట్టి నెలకు రూ. 1,250 నుంచి రూ. 37,500 వరకూ ఉపకార వేతనాలను అందిస్తారు. అయితే, కరోనా సంక్షోభాన్ని సాకుగా చూయించిన కేంద్రం 2021లో ఈ పరీక్ష నిర్వహణను నిలిపేసింది. కరోనా సద్దుమణిగిన తర్వాత కూడా పరీక్ష నిర్వహణను పట్టించుకోలేదు. అలా గడిచిన మూడేండ్లుగా ఈ పరీక్ష నిర్వహించకపోవడంతో.. టాలెంట్ ఉన్నప్పటికీ ఎంతోమంది పేద విద్యార్థులు ఉపకార వేతనాలు విడుదల కాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చులను తగ్గించుకోవడానికే కేంద్రం ఈ టాలెంట్ స్కాలర్షిప్లను నిలిపేసిందని ఆధికారిక వర్గాలను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ తెలిపింది.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ధైర్యాన్ని నూరిపోసే ఉద్దేశంతో ప్రారంభించిన పీఎం ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ఇప్పుడు ఓ పీఆర్ స్టంట్లా మారిందన్న విమర్శలు ఉన్నాయి. కాగా, గడిచిన మూడేండ్లలో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేశారని కేంద్రాన్ని ‘టెలిగ్రాఫ్’ ఓ ఆర్టీఐ పిటిషన్ ద్వారా ప్రశ్నించింది. రూ.62 కోట్లు ఖర్చయినట్టు కేంద్రం సమాధానమిచ్చింది. అయితే, ఎన్టీఎస్ఈ పరీక్ష నిర్వహణ, ఉపకార వేతనాలకు మూడేండ్లలో రూ.40 కోట్ల మేర కూడా ఖర్చయ్యేది కాదని టెలిగ్రాఫ్ ఓ కథనంలో వెల్లడించింది. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి రాని డబ్బులు.. పీఆర్ స్టంట్లకు మాత్రం వస్తాయంటూ టెలిగ్రాఫ్ ఆ కథనంలో ఘాటుగా స్పందించింది. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడాన్ని పక్కనబెట్టి ప్రధాని మోదీ పీఆర్ స్టంట్లపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు.
‘పరీక్షా పే చర్చా’ అంటూ ప్రధాని మోదీ తమ ప్రచారానికి ఆ కార్యక్రమాన్ని వాడుకోవడం దురదృష్టకరం. ఇదే సమయంలో టాలెంట్ టెస్టును నిలిపేయడం ఆందోళన కలిగిస్తున్నది. ‘ఎగ్జామ్ వారియర్స్’ పేరిట విద్యార్థుల కోసం ప్రధాని మోదీ ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో ఉన్న విషయాలనే ప్రతీయేటా ‘పరీక్షా పే చర్చా’లో చర్చిస్తున్నారు. దీంతో అనవసరపు ఖర్చు తప్ప ఒనగూరే లాభమేంటి?