Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బుధ్రామ్ అనే వ్యక్తికి ఓ వింతైన అనుభవం ఎదురైంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఆయనకు ఇల్లు మంజూరైంది. తన ఇంటి గృహ ప్రవేశానికి గవర్నర్ మంగూభాయ్ వస్తున్నారని, తన ఇంటిలోనే భోజనం కూడా చేస్తారని అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో బుధ్రామ్ ఎగిరి గంతేశాడు. సాక్షాత్తూ గవర్నరే గృహ ప్రవేశానికి వస్తున్న సందర్భంగా స్థానిక అధికారులు ఆ ఇంటిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. నూతన గృహ ప్రారంభోత్సవం కాబట్టి ఫ్యాన్లు, ఓ గేటును కూడా అమర్చారు. ప్రభుత్వం అనుకున్న సమయానికి గవర్నర్ మంగూభాయ్ వచ్చి, బుధ్రామ్కు కేటాయించిన ఇంటి గృహప్రవేశం చేశారు. అక్కడే భోజనం కూడా చేశారు. దీంతో గవర్నర్ పర్యటన ముగిసింది.
ఆ మరుసటి రోజు బుధ్రామ్కు అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. తాము అమర్చిన ఫ్యాన్లను, ఇతర సామాన్లను తీసుకెళ్లిపోయారు. అలాగే ఆ ఇంటికి కొత్త గేటు అమర్చామని, దీనికి 14,000 రూపాయల బిల్లు అయ్యిందని, ఆ డబ్బులను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బుధ్రామ్ విస్తుపోయారు. ”గవర్నర్ గృహ ప్రవేశం చేయడానికి వస్తారని, మా ఇంట్లోనే భోజనం కూడా చేస్తారని అధికారులు నాతో చెప్పారు. కొత్త గేటును కూడా అమర్చారు. ఇప్పుడు దాని కోసం 14,000 రూపాయలు అడుగుతున్నారు. నా దగ్గర అంత డబ్బులేదు. ఇలా డబ్బులు అడుగుతారని తెలిస్తే, కొత్త గేటు అమర్చడానికి నేను అంగీకరించేవాడ్నే కాదు” అని బుధ్రామ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
అధికారుల వ్యవహార శైలిపై రాష్ట్ర మంత్రి భూపేంద్ర సింగ్ను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ… బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని, ఇలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. గవర్నర్ గౌరవానికి భంగం కలిగించే అంశమని, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భూపేంద్ర సింగ్ స్పష్టం చేశారు.