Rashtrapati Bhavan | న్యూఢిల్లీ, జనవరి 31: దేశ ప్రథమ పౌరురాలి అధికారిక నివాస ప్రాంగణంలో చరిత్రలోనే మొదటిసారిగా పెండ్లి బాజాలు మోగనున్నాయి. ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారుల వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కానున్నది. రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓగా పని చేసే సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండంట్ పూనమ్ గుప్తా – జమ్ము కశ్మీర్లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండంట్‌గా పని చేస్తున్న అవ్నీశ్ కుమార్ మనువాడనున్నారు. ఫిబ్రవరి 12న వీరి వివాహం జరగనున్నది.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్‌లోనే వివాహాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో పరిమిత సంఖ్యలో అతిథుల నడుమ వీరి వివాహం జరగనున్నది. అతిథుల జాబితా తయారవుతున్నది. జాబితాలో ఉన్న వారికే వివాహానికి హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. కాగా, పూనమ్ గుప్తా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని శివపురి. ఇటీవల గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి ఆమె సారథ్యం వహించారు.