Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంతో పాటు ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం భారీగా పెరిగింది. ఊపిరితీసుకునేందుకు కూడా ఇబ్బందులుపడాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. ఈ క్రమంలో శ్వాసనాళాలపై కాలుష్యం ఎలా ప్రభావం చూపుతుందో ఢిల్లీ ఎయిమ్స్ తొలిసారిగా డెమో చూపించింది. పీఎం 10, పీఎం 2.5తో పాటు నాలుగు విభిన్న రకాల శ్వాసనాళాలతో కూడిన డెమోలో పీఎం 1, పీఎం 1.5 పరిమాణంలోని అతిసూక్ష్మ కాలుష్య కారకాల ఘోరమైన ప్రభావం స్పష్టంగా చూపుతుంది. గాలి నాణ్యత పడిపోయిన సందర్భంలో శ్వాస పీల్చుకునే సమయంలో పీఎం 2.5 కణాలు మొదట శ్వాసనాళం చుట్టూ అంటుకుంటాయి. ఆ తర్వాత క్రమంగా ఈ కణాలు శ్వాసనాళం రంధ్రాలను లక్ష్యం చేసుకొని చిన్నగా అయ్యేలా చేస్తాయి. పైప్ చిన్నగా మారడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలవుతాయి. ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ లభించింది. ఫలితంగా ఊపిరితిత్తుల పనితీరులో మార్పులు వస్తాయి. ఎయిమ్స్ పల్మనరీ విభాగం సీనియర్ డాక్టర్ కరణ్ మదన్ మాట్లాడుతూ వాయు కాలుష్యం భారీగా ఉంటే మూడు నుంచి నాలుగు వారాల్లో శ్వాసకోశం ప్రభావితమవుతుందన్నారు. కాలక్రమేణా ఆస్తమా, COPDగా మారుతుందన్నారు.
కాలుష్యం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నప్పటికీ.. మొదటి లక్ష్యం ఊపిరితిత్తులే. వాటితో పాటు శ్వాస ద్వారా రక్తంలోకి చేరే కాలుష్య కణాలు కొలెస్ట్రాల్, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల బారినపడేలా చేస్తాయి. కాలుష్యంతో ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, కరోనరీ బ్లాకేజ్ సమస్య ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచడానికి కారణం కూడా ఇదేనన్నారు. విషపూరితమైన గాలి మన ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా గుండెపోటు, స్ట్రోక్, స్వల్ప ఊబకాయం ప్రమాదం పెంచుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో కొంతకాలంగా పెరుగుతున్న కాలుష్య స్థాయి కారణంగా ఎయిమ్స్‌లోని ఓపీడీ స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. చాలా మంది రోగులకు స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. కాలుష్యానికి ఎక్కువ కాలం గురికావడంతో గర్భిణుల్లో ప్రీమెచ్యూర్ డెలివరీకి కారణమవుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. వాయు కాలుష్యం 2021లోనే 21 లక్షల మంది భారతీయుల ప్రాణాలు తీసింది. ఎందుకంటే పీఎం 2.5 కణాలు రక్తంలో చొరబడి ఆ తర్వాత వివిధ అవయవాలకు చేరి గుండెజబ్బులు, స్ట్రోక్, ఆస్తమా, నరాల సంబంధిత సమస్యల బారినపడేలా చేస్తాయి. సాధారణంగా మనిషి ఊపిరితిత్తుల పొడవు తొమ్మిది అంగుళాలు. 24 గంటల్లో 10వేల లీటర్ల గాలిని పీలుస్తుంటారు. శ్వాస తీసుకున్న సమయంలో ఊపిరితిత్తుల పరిమాణం పదిన్నర అంగుళాల వరకు పెరుగుతుంది.
బరువు 0.99 కిలోల వరకు ఉంటుంది. ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తి సగటు ఊపిరితిత్తుల సామర్థ్యం సుమారు 6 లీటర్లు. అయితే, ఊపిరితిత్తుల పరిమాణం, సామర్థ్యం వయస్సు, శరీర నిర్మాణం, లింగబేధం బట్టి ఇందులో మార్పులుంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు ప్రభావితమైతే పనితీరు సామర్థ్యం తగ్గుతుందన్నారు. ఇది చాలాకాలం పాటు కొనసాగితే మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం కష్టమని పేర్కొంటున్నారు. యోగా, వ్యాయామంతో ఊపిరితిత్తుల పనితీరు గరిష్ఠంగా 40 శాతం వరకు రికవరీ సాధ్యమవుతుందని పుల్మోకేర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ప్యూర్) ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ సాల్వే తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ, ఎన్సీఆర్లోని గాలి నాణ్యత ఊపిరిపీల్చుకునేందుకు సరిపోదని ఎయిమ్స్ డాక్టర్ జావేద్ పేర్కొన్నారు. PM 2.5 స్థాయి చాలా ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలిందని.. గాలిలో ఉండే హానికరమైన రసాయనాలను సులభంగా గుర్తించే పరికరాన్ని సైతం ఎయిమ్స్ రూపొందించింది. ఆ డివైజ్‌తో నికెల్, క్రోమియం, రెడియం, సీసం, నైట్రోజన్ తదితర అనేక రకాల ప్రమాదకరమైన రసాయనాలు గాలిలో ఉన్నాయని తేలిందన్నారు.