న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నైతికంగా పరాజయం పొందినప్పటికీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భావసారూప్యత కలిగిన పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. (INDIA bloc meet) బుధవారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ సమావేశం జరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు, కూటమి భవిష్యత్తు గురించి నేతలు చర్చించారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలసికట్టుగా పోటీ చేసిన ఇండియా కూటమిలోని భాగస్వాములంతా ఐక్యంగా ఉన్నారని ఖర్గే తెలిపారు. ‘నిర్ణయాత్మకంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల తీర్పు ఉంది. స్పష్టమైన నైతిక పరాజయం ఉన్నప్పటికీ, ప్రజల అభీష్టాన్ని తారుమారు చేయడానికి మోదీ నిర్ణయించుకున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు కట్టుబడి ఉన్న అన్ని పార్టీలకు భారత కూటమి స్వాగతం పలుకుతోంది’ అని అన్నారు. కూటమి పార్టీలు ఐక్యంగా, దృఢంగా ఎన్నికల్లో పోరాడాయని ఖర్గే ప్రశంసించారు.
మరోవైపు ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత టీఆర్ బాలు, జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్, జేఎంఎంకు చెందిన కల్పనా సోరెన్, ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, శివసేన (యూబీటీ) నేతలు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ రాజా, ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా తదితర నేతలు పాల్గొన్నారు.
#WATCH | INDIA bloc leaders hold a meeting at the residence of Congress president Mallikarjun Kharge in Delhi.
(Source: AICC) pic.twitter.com/1xtYlqQviE
— ANI (@ANI) June 5, 2024