భోపాల్: బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల.. ఆ దేశంతో వాణిజ్యం నిర్వహిస్తున్న భారతీయ రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఆవాల పంటను వేసే రైతులకు ఇప్పుడు ఇక్కట్లు వచ్చాయి. ఎందుకంటే.. ఆవాలకు చెందిన పంట.. గ్వాలియర్-ఛంబల్ లోయల్లో ఎక్కువగా పండుతుంది. అయితే ఆ అవాల నుంచి తీసిన డీ ఆయిల్డ్ కేక్(డీవోసీ)ను ఎక్కువగా బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో.. ఆవాలకు చెందిన డీ ఆయిల్డ్ కేక్ ఎగుమతి నిలిచిపోయింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సుమారు 150 కోట్ల నష్టం వాటిల్లింది. ఇంకా సుమారు 20 వేల మంది రైతుల జీవనం దెబ్బతింటోంది.
ఆవాలకు చెందిన డీవోసీని .. బంగ్లాదేశ్‌లో పౌల్ట్రీ, ఫిష్, యానిమల్ ఫీడ్‌గా వాడుతారు. ఛంబల్ ప్రాంతంలో సుమారు 50 ఆవాల ఆయిల్ మిల్స్ ఉన్నాయి. దీంతో పాటు రాజస్థాన్, యూపీల్లో మరో 150 మిల్లులు ఉంటాయి. ఈ మిల్లులో తయార్యే 90 శాతం డీవోసీ బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతుంది. బంగ్లాదేశ్‌లో వ్యాపారం నిలిచిపోవడంతో.. తమ వద్ద మిల్స్ స్తంభించిపోయినట్లు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు సంజీవ్ జిందాల్ తెలిపారు.
గ్వాలియర్ ప్రాంతంలో ప్రతి రోజు సుమారు 3500 టన్నుల డీఓసీని ఉత్పత్తి చేస్తారు. సాంకు, రైరు రైల్వే స్టేషన్ల ద్వారా ఆ ఉత్పత్తులను బంగ్లాదేశ్‌కు తరలిస్తారు. ప్రతి నెలా ఆ ఎగుమతి విలువ సుమారు 150 కోట్లు ఉంటుంది. దీంతో పాటు రైల్వే శాఖకు సుమారు కోట్లల్లో నష్టం వస్తోంది. అకస్మాత్తుగా ఉత్పత్తి నిలిచిపోవడం, ఎగుమతి స్తంభించడం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇండ్లకు పంపాల్సి వచ్చినట్లు సంజీవ్ జిందాల్ తెలిపారు.