చెన్నై, ఏప్రిల్ 15: కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన; లోక్‌సభ సీట్ల విస్తరణతో కొత్త రాజకీయ ఉద్రిక్తత తలెత్తుతున్నది. ఏ రాష్ట్రమూ నష్టపోదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ దీని వల్ల తమ రాజకీయ వాణి క్షీణించే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ర్టాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక బీజేపీ లేదా ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ర్టాలకు ప్రతిపాదిత డీలిమిటేషన్ భారీగా లబ్ధి చేకూర్చడమే గాక ప్రతిపక్ష పాలిత దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పడానికి ప్రతిపాదిత అంచనాలే స్పష్టం చేస్తున్నాయి.
లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది. 2011 సెన్సస్ ప్రకారం లోక్‌సభలో సీట్ల ప్రాతినిధ్యం ఆధారంగా పెంపుదల ఉంటుందని చెబుతున్నది. ఎన్డీయే పాలిత రాష్ర్టాలను ఉదాహరణగా తీసుకుంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్య 80. ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల ప్రాతినిధ్యం 14.7 శాతం. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 140కి సీట్ల పెంపు. దీంతో లోక్‌సభలో సీట్ల ప్రాతినిధ్యం 16.5 శాతానికి చేరుకుంటుంది.
అంటే యూపీ ప్రానినిధ్యం 1.7 శాతం పెరుగుతుంది. ఎన్డీయే పాలిత మరో రాష్ట్రమైన బీహార్ విషయానికి వస్తే ప్రస్తుత సీట్ల సంఖ్య 40 ఉండగా లోక్‌సభలో సీట్ల ప్రాతినిధ్యం 7.4 శాతంగా ఉంది. డీలిమిటేషన్లో సీట్ల సంఖ్య 73కి చేరుకోవచ్చని అంచనా. దీంతో ప్రాతినిధ్యం 8.6 శాతానికి చేరకుంటుంది. పెంపు 1.2 శాతం. ఇక ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న దక్షిణాది విషయానికి వస్తే తమిళనాడులో ప్రస్తుత సీట్ల సంఖ్య 39. లోక్‌సభలో సీట్ల ప్రాతినిధ్యం 7.2 శాతం. అంచనాల ప్రకారం సీట్ల సంఖ్య 51కి పెరగవచ్చు. దీంతో ప్రాతినిధ్యం 6.0కి పడిపోతుంది. అంటే 1.2% క్షీణత ఉంటుంది.
కేరళకు సంబంధించి ప్రస్తుత సీట్ల సంఖ్య 20 కాగా లోక్‌సభలో ప్రాతినిధ్యం 3.7 శాతం. ప్రతిపాదిత అంచనాల ప్రకారం సీట్ల సంఖ్య 23కి చేరుకోవచ్చు. అంటే ప్రాతినిధ్యం 2.7 శాతం ఉంటుంది. దీని వల్ల 1.0 శాతం తగ్గుదల ఉంటుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన కారణంగా 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను లెక్కగడితే మొత్తం సీట్ల సంఖ్య 42 (అందులో 17 తెలంగాణ, 25 ఆంధ్రప్రదేశ్). లోక్‌సభలో సీట్ల ప్రాతినిధ్యం 7.7 శాతం. డీలిమిటేషన్లో సీట్ల సంఖ్య 59కి పెరుగవచ్చని అంచనా. అప్పు డు ప్రాతినిధ్యం 6.9 శాతం ఉండవచ్చు. దీంతో 0.8 శాతం తగ్గుదల ఏర్పడుతుంది.