బెంగళూరు, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నలభై శాతం కమీషన్ (అవినీతి), టికెట్ల పంపిణీలో ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాల ప్రోత్సాహం తదితర లోపాలతో సతమతమవుతున్న బీజేపీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పాతిక నియోజక వర్గాల్లో బలమైన తిరుగుబాట్లను ఎదుర్కొంటున్నది. అభివద్ధి, సంక్షేమ పథకాల అమలులో దారుణంగా వెనుకబడటం, కేంద్రం పన్నుల బాదుడు, పరిపాలన విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడం వల్ల కేవలం 65-75 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని కమలం పార్టీ అంతర్గత సర్వేలు నెల కిందట అంచనా వేశాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో లింగాయత్‌లు పార్టీకి దూరం కావడం, తిరుగుబాటు అభ్యర్థుల వల్ల బీజేపీ ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయమని తెలుస్తున్నది. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారిలో కనీసం 25 మంది స్థానికంగా రాజకీయంగా బలమైనవారు కావడమే ఇందుకు కారణం. తిరుగుబాటుదార్లలో ఎందరు గెలుస్తారనే విషయాన్ని పక్కనపెడితే వారు బీజేపీ ఓట్లకు గండి కొట్టటం వల్ల మరో అభ్యర్థికి లాభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది, మాజీ మంత్రి బాబూరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎన్వై గోపాలకృష్ణ, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ పుట్టణ్ణ, మాజీ సీఎం యెడియూరప్ప మేనల్లుడు ఎన్ఆర్సంతోష్, మాజీ ఎంపీ ఆయనూరు మంజునాథ్, ఎంపీ కుమారస్వామి, మాజీ మంత్రి ఏబీ మాలకరెడ్డి, మాజీ మంత్రి ఏ మంజు, డాక్టర్ భారతిశంకర్ తదితరులు కాంగ్రెస్, జేడీఎస్ తరపున పోటీ చేస్తున్నారు. గూళిహట్టి శేఖర్ (సదుర్గ), డాక్టర్ విశ్వనాథ్ పాటిల్ (బైలెంగల్) స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. తిరుగుబాటు అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కమలం పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. కానీ కొందరు వారి మాటలు వినడం లేదు. ఇంకొందరు విన్నా, ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.