న్యూఢిల్లీ: ఈ నెల 1న తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లి చంపేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రమాదంలో జరిగిన సమయంలో అంజలితోపాటు మరో యువతి కూడా ఉన్నట్లు ఢిల్లీ గుర్తించిన పోలీసులు.. సీసీ పుటేజ్ ఆధారంగా ట్రేస్ చేసి ఆమెను సుల్తాన్‌పురి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించి ఆమె నుంచి వివరాలు రాబడుతూ.. వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు.
పోలీసులు విచారణలో యువతి ఏం చెప్పిందనేది వెల్లడికావాల్సి ఉంది. జనవరి 1న తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తున్న అంజలి అనే యువతిని దుండగులు కారుతో ఢీకొట్టారు. స్కూటీ కారులో ఇరుక్కున్నా అలాగే 13 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. స్కూటీ కారు నుంచి వేరుపడిన తర్వాత పారిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి చివరికి ప్రాణాలు కోల్పోయింది.
దాంతో అది ప్రమాదం కాదు హత్య అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి కుటుంబసభ్యులు కూడా అది హత్యేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ప్రమాదం జరిగినప్పుడు స్కూటీపై అంజలితోపాటు మరో యువతి ఉందని గుర్తించారు. అనంతరం యువతిని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎంక్వయిరీ చేస్తున్నారు.