కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. పశ్చిమ మేదినీ పూర్ పోలీసులు అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్‌ని పట్టుకునేందుకు అభిషేక్ బెనర్జీ ఇంటి లోనికి చొరబడ్డారని ‘ఎన్డీటీవీ’ తెలిపింది. రాయ్‌పై ఒక దోపిడీ కేసు నమోదైన సందర్భంగా ఈ పరిణామాలు చేటుచేసుకున్నాయి. కాగా ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ భద్రతా సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు ఆ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న వెంటనే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అభిషేక్ ఇంటికి చేరుకుని పోలీసుల బృందాన్ని నిలదీశారు.
కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య హైడ్రామా నడిచిన అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మమత కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు. శనివారం ఉదయం కూడా అభిషేక్ బెనర్జీ ఇంటివద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కాగా విలేకరులు అర్ధరాత్రి తనిఖీల గురించి అభిషేక్ బెనర్జీని అడగ్గా ‘వెళ్లి దర్యాప్తు సంస్థలను అడగండి’ అని సమాధాన మిచ్చారు. తన సహాయకుడు సుమిత్ రాయ్‌పై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ చర్య ను రాజకీయ క్షక్షాపూరిత చర్యగా అభివర్ణించారు.
ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అభిషేక్ బెనర్జీపై ఫిర్యాదు నమోదైంది. అభిషేక్ బెనర్జీ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రచారమైన ఆయన ప్రసంగాలు, వీడియోలు రాష్ట్రంలోని సామాన్య ప్రజల్లో భయాందోళనలను, రాజకీయ ఉద్రిక్తతను కలిగించాయని వ్యాపారవేత్త, సిలిగురి మర్చంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింఘాల్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
కోల్‌కతాలో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రాకు చెందిన ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం దాడులు నిర్వహించింది. పురపాలక శాఖ ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై తెల్లవారుజాము నుంచే ఆయనకు చెందిన ఏడు ఆస్తులపై ఈడీ దాడులు జరిపింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని మిత్రా పలువురు అభ్యర్థుల నుంచి బంగారం, నగదును లంచాలుగా స్వీకరించినట్టు ఈడీ ఆరోపించింది.