కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) ఇంట్లో ఇవాళ పోలీసులు సోదాలు చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్నది. అభిషేక్ బెనర్జీ వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేసిన సుమిత్ రాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అతని కోసం అభిషేక్ ఇంటికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం ఉంది. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ రోడ్డులో ఉన్న నివాసానికి తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు చేరుకున్నారు. వెస్ట్ మిడ్నాపూర్ డీఎస్పీ నేతృత్వంలో సోదాలు సాగాయి. కేంద్ర సాయుధ బలగాలు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అభిషేక్ ఇంట్లో సుమిత్ రాయ్ ఉంటాడన్న అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు. కానీ ఏ కేసులో అతని కోసం గాలిస్తున్నరన్న విషయాన్ని వెల్లడించలేదు.
అభిషేక్ ఇంటి వద్ద తెల్లవారుజామున సుమారు రెండు గంటల పాటు పోలీసులు ఎదురుచూశారు. ఇంటి గేటు తీసేందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కాళీఘాట్ పోలీసులు వచ్చి ఎంట్రెన్స్ లాక్‌ను బ్రేక్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సహకరించారు. సుమారు రెండు గంటల పాటు అభిషేక్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే మేనల్లుడు అభిషేక్ ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మమతా బెనర్జీ అక్కడకు చేరుకున్నది. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నట్లు అభిషేక్ ఆరోపించారు.మెయిన్ గేటు తాళాలను పగులగొట్టి పోలీసులు తమ ఇంట్లోకి ఎంటర్ అయినట్లు ఆయన ఆరోపించారు.
ఇక రాబోయే మూడు రోజులు అభిషేక్‌ను పోలీసులు విచారించనున్నారు. జూన్ 14వ తేదీన ఫోర్జరీ సంతకం కేసులో సీఐడీ ఆయన్ను విచారించనున్నది. వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే ఆయన్ను ప్రశ్నించారు. ఇక జూన్ 15వ తేదీన క్యాష్ ఫర్ స్కూల్ జాబ్ కేసులో ఈడీ విచారించనున్నది. జూన్ 3వ తేదీన ఈ కేసులో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇక జూన్ 16వ తేదీన మరోసారి సీబీఐ ముందు హాజరుకానున్నాడు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో హింసకు పాల్పడిన కేసులో ఆయన్ను విచారించనున్నారు.