సీతామర్హి, జనవరి 1: నడిరోడ్డుపై ఒక దళిత మహిళను పోలీస్ అధికారి లాఠీతో చితకబాదిన ఘటన బీహార్‌లోని సీతామర్హిలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వీడియోలో ఉన్న పోలీస్ అధికారి రాజ్‌కిశోర్ సింగ్ అని.. జరిగిన ఘటనలో అతడి తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకొంటామని సీతామర్హి ఎస్పీ మనోజ్ కుమార్ తివారీ సోమవారం వెల్లడించారు. మరో మహిళతో వీధిలో గొడవ పడినందుకు బాధితురాలిని రాజ్‌కిశోర్ సింగ్ కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా స్పందిస్తూ బీహార్‌లో నేరగాళ్లు దర్జాగా తిరుగుతుంటే సామాన్యులపై పోలీసులు లాఠీ ఛార్జి చేస్తున్నారని విమర్శించారు.