జోధ్‌పూర్: బీజేపీ పాలిత రాజస్థాన్‌లో పోలీసుల ఉదాసీనత, నిర్లక్ష్యం.. రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు తీసింది. తన సోదరి గ్యాంగ్ రేప్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన నిందితుడు ఏకంగా ఆమెనే టార్గెట్ చేయడంతో తనకు న్యాయం జరగదని ఆవేదనతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. జోధ్‌పూర్‌లోని ఒక గ్రామంలో ఒక సర్వీస్ సెంటర్లో పనిచేసే మహిళను మహిపాల్ అనే వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకున్నాడు. తర్వాత ఆమె అభ్యంతరకర వీడియోలు తీసి, వాటిని చూపి ఆమెను బెదిరించి 8 మందితో గ్యాంగ్ రేప్ చేయించాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేవాడు.
ఆమెపై సామూహిక లైంగిక దాడి కొన్ని ఏండ్ల పాటు సాగింది. దీంతో బాధితురాలు మార్చి 20న ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదైనా పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేయడంతో నిందితుడు మరింత రెచ్చిపోయాడు. తన అక్క మరణంపై ఆమె చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి ఒత్తిడి తేవడంతో మహిపాల్ ఆమెనూ టార్గెట్ చేసి వేధింపులు ప్రారంభించాడు. దీని గురించి చెప్పినా పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ఆమె శుక్రవారం ఒక ట్యాంక్ పైకెక్కి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.