INDIA| న్యూఢిల్లీ: విపక్షాలు తమ రాజకీయ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై అవినిశ్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పొలిటికల్ ఫ్రంట్‌కు ‘ఇండియా’ అని పేరు పెట్టడం ద్వారా ఈ పార్టీలకు ఎన్నికల్లో అనుచిత లబ్ధి కలుగుతుందని ఆయన ఆరోపించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. తొలుత ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టాలని భావించారు. అయితే ఇది నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్‌కు దగ్గరగా ఉండటంతో డెమొక్రటిక్ స్థానంలో డెవలప్మెంటల్ అని మార్చారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్, జేడీయూ, ఆప్, తృణమూల్, ఎన్సీపీ తదితర పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి.