గువాహటి: అసోం డీజీపీ గ్యానేంద్ర ప్రతాప్ సింగ్ హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న తన కుమార్తె ఐశ్వర్యా సింగ్కు సెల్యూట్ చేశాడు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్లో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆ ఉద్విగ్న క్షణాలకు సంబంధించిన వీడియోను అసోం డీజీపీ శనివారం తన ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేశాడు.
ఆ వీడియోలో తండ్రికి కుమార్తె, కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ నవ్వుతూ ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండ్రి, కుమార్తెలను మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెను కూడా ఐపీఎస్ అధికారిణిని చేయగలగడం చాలా గొప్ప విషయమని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా, సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన గ్యానేంద్ర ప్రతాప్ సింగ్ ఈ నెల 1న అసోం డీజీపీగా నియమితులయ్యారు. తన లాగే తన కుమార్తె కూడా ఐపీఎస్ అధికారి కావడంపై ఆయన మాట్లాడుతూ.. చాలా గర్వంగా ఉందన్నారు. తన లాగే తన కుమార్తె కూడా పోలీస్ డిపార్టుమెంటులో అంచెలంచెలుగా ఎదగాలనీ ఆయన ఆకాంక్షించారు. తన కుమార్తె పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ఆనందంతో తనకు నోటమాట రాలేదని చెప్పారు.