ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విడుదలైన పుస్తకం వివాదాల్లో ఇరుక్కుంది. ఆ పుస్తకాన్ని నిషేధించాలని సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాశీ కారిడార్‌ను ప్రారంభించడంతో పాటు వారణాసి స్థల చరిత్రను తెలిపే ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరు విశ్వనాథ్ ధామ్ కా గౌరవశాలీ ఇతిహాస్. ఇందులో వారణాసి చరిత్ర ఉంది. దీనిని భక్తులకు కూడా పంచిపెట్టారు. అయితే ఇందులో తమ సిక్కుల చరిత్రకు సంబంధించిన విషయాన్ని తప్పుగా లిఖించారని శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ ఆరోపిస్తోంది. ఆ పుస్తకాన్ని నిషేధించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ మీడియా బాధ్యుడు కుల్విందర్ సింగ్ రాందాస్ డిమాండ్ చేశారు.
పంజ్ప్యారాతో కలిసి ఖల్సాపంథాను స్థాపించే మునుపు గురుగోవింద్ సింగ్ ఆయన్ను కాశీకి పంపారని, సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకొని, దానిని రక్షించాలని అన్నట్లు ఆ పుస్తకంలో ఉందని కుల్విందర్ సింగ్ వెల్లడించారు. అంతేకాకుండా మొఘలాయిల నుంచి సనాతన ధర్మాన్ని కాపాడడానికి సిక్కు మత స్థాపన జరిగిందని కూడా ఆ పుస్తకంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు విషయాలూ పూర్తిగా అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. మతపరమైన విలువలను పరిరక్షించడానికి, అణచివేతను ఎదుర్కోడానికి ఖల్సాపంథా స్థాపన జరిగిందని కుల్విందర్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.