న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గర్జించారు. మంగళవారం జంతర్‌మంతర్ వద్ద అఖిల భారత చౌకధరల దుకాణాల డీలర్ల ఫెడరేషన్ (ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్) భారీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు తెలంగాణతో సహా అన్ని రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో రేషన్ డీలర్లు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కూడా ధర్నాలో పాల్గొన్నారు. డీలర్ల ఫెడరేషన్‌కు ప్రహ్లాద్ మోదీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోదీతో పాటు ఫెడరేషన్ సభ్యులు బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ధర్నాకు తెలంగాణ నుంచి సుమారు 4వేల మంది రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించాలి..
ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ తమ మనుగడకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఫెడరేషన్ బృందం త్వరలో ప్రధాని మోదీని కలిసి మెమోరాండం సమర్పిస్తుందని పేర్కొన్నారు. జీవన వ్యయం, దుకాణాలను నడుపడంలో ఖర్చుల పెరుగుదలతో పోలిస్తే.. కిలోకు మార్జిన్ కేవలం 20 పైసలు పెంచడం క్రూరమైన జోక్ అని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలని కేంద్రాన్ని కోరారు. ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంభర్ బసు మాట్లాడుతూ వంటనూనె, పప్పులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు రేషన్ షాపుల ద్వారానే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తున్న బియ్యం, గోధుమలు, చక్కెర, వంటనూనె, పప్పులపై వస్తున్న నష్టాలకు పరిహారం అందించాలని ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. తమకు ఇచ్చే కమీషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు మేరకు కిలోకు 70 పైసల నుంచి రూ.4.40కి పెంచాలని, క్వింటాలుకు 1 కిలో తరుగుకు అనుమతించాలని డీలర్లు డిమాండ్ చేశారు.
మా సమస్యలు పరిష్కరించాలి
మా సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఏళ్లుగా కమీషన్‌ను పెంచడం లేదు. దీంతో డీలర్లకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. అందుకే కమీషన్‌ను క్వింటాలుకు రూ.440కి పెంచాలి. కమీషన్ పెంపును కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీనే రికమెండ్ చేసింది. – మురళీ మోహన్,
రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం వైస్‌ప్రెసిడెంట్