PM Modi : ప్రజలంతా ‘స్వదేశీ’ని స్వీకరించి, దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకంవల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరూ గర్వంగా ‘స్వదేశీ’ అని చెప్పాలని, ఇది ప్రతి పౌరుడికి, మార్కెట్‌కు ఒక మంత్రంలా మారాలని, ప్రజలు దేశీయ వస్తువులను కొనుగోలు చేసి, వాటినే బహుమతులుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి మన ఆర్థిక వ్యవస్థకే చేరుతుందని ప్రధాని చెప్పారు. తద్వారా వృద్ధి, ఉపాధి పెరుగుతాయని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలవల్ల దేశానికి, ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఇటీవల ముగిసిన నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా జరగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ గత యూపీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌పై ఎందుకు దాడి చేయలేదని, ఎవరి ఒత్తిడితో ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందో దేశం తెలుసుకోవాలనుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ బలహీన విధానాల వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోయారని, దేశ భద్రత బలహీనపడిందని ఆరోపించారు. తమ ప్రభుత్వానికి మాత్రం దేశభద్రతే అత్యంత ప్రధానమని, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని గుర్తుచేశారు.