PM Modi | న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో లౌఖిక పౌర స్మృతి తక్షణ అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ‘ఇప్పుడు ఉన్న పౌర స్మృతి మతపరమైన పౌరస్మృతి అని సమాజంలోని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇందులో నిజం ఉంది. మనం 75 ఏండ్లు మతపరమైన పౌర స్మృతితో జీవించాం. వివక్షను ప్రోత్సహించే పౌర స్మృతితో జీవించాం. ఇది దేశాన్ని మతప్రాతిపదికన విభజించడంతో పాటు అసమానతలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పుడు మనం లౌఖిక పౌర స్మృతి దిశగా పయనించాల్సి ఉంది. దేశానికి లౌకిక పౌర స్మృతి తక్షణ అవసరం. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే. సుప్రీంకోర్టు కూడా దీని అవసరాన్ని అనేకసార్లు నొక్కి చెప్పింది.
రాజ్యాంగ నిర్మాతల కలను నెరవేర్చాలి.’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఘటనలను ఆయన ప్రస్తావిస్తూ ఆ దేశంలోని హిందువులు, ఇతర మైనారిటీల భద్రత పట్ల 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనతో ఉన్నారని అన్నారు. దేశంలో తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని, జమిలి ఎన్నికలకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారికి విధించే శిక్షలకు విస్తృత ప్రచారం కల్పించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆడవాళ్లపై దారుణాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుందనే భయం నేరస్తుల్లో రావాలన్నారు.
భారతదేశానికి ముఖ్యంగా ప్రపంచ కోణంలో ఇది స్వర్ణయుగమని, ఆ అవకాశాన్ని వదులుకోవద్దని మోదీ ప్రజలను కోరారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారని, రాష్ర్టాలు స్పష్టమైన విధానాలు రూపొందించి పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. పెట్టుబడులు పెట్టాల్సింది రాష్ర్టాల్లో కాబట్టి కేంద్రం మాత్రమే ఈ పని చేయలేదని ప్రధాని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన, సుసంపన్న దేశంగా మారాలనే లక్ష్యాన్ని అందుకోవాలంటే 140 కోట్ల మంది భుజం భుజం కలిపి నడవాలన్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధిస్తామని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని, రాజకీయ కుటుంబ నేపథ్యం లేని లక్ష మంది యువత ప్రజాజీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఐదేండ్లలో 75 వేల కొత్త వైద్య విద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దేశం ఎదుగుదలను జీర్ణించుకోలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి వక్రబుద్ధి ఉన్న గుప్పెడు మంది కూడా అస్థిరతకు బాటలు వేయవచ్చని, అన్నీ నాశనం చేయాలని వారు కలలు కంటున్నారని ఆరోపించారు. కాగా, మోదీది ఇది 11వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం.ఈసారి ఆయన 98 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు.
ఇప్పుడు దేశంలో ఉన్నది ‘మతపరమైన పౌరస్మృతి’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోదీ వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించడమే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘విద్వేషం, అపహాస్యం, చరిత్రను వక్రీకరించడంలో మానవాతీత ప్రధానమంత్రి సామర్థ్యానికి అవధులు లేవు. ఎర్రకోట నుంచి వీటిని ఆయన పూర్తిగా ప్రదర్శించారు. ఇప్పటివరకు మతపరమైన పౌరస్మృతి ఉందని అనడం అంటే హిందూ పర్సనల్ చట్టాల్లో సంస్కరణలు తీసుకువచ్చిన అంబేద్కర్‌ను తీవ్రంగా అవమానించడమే. ఈ సంస్కరణలను బీజేపీ, జన్‌సంఘ్ వ్యతిరేకించింది’ అని పేర్కొన్నారు. మోదీ ప్రసంగంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పందిస్తూ.. దేశాన్ని ఏకం చేసేందుకు, ప్రజల్లో స్ఫూర్తి నింపే అంశమేదీ ప్రసంగంలో లేదని, ఆర్ఎస్ఎస్ విభజన అజెండా ప్రకారమే మోదీ మాట్లాడారని ఆరోపించారు. దేశంపై ఏకరూపతను రుద్దేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి సంకుచిత బుద్ధిని వదులుకుంటారని అనుకున్నప్పుడల్లా ఆయన నిరాశపరుస్తున్నారని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఐదో వరుసలో సీటు కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ‘చిన్న బుద్ధి ఉన్న వారి నుంచి పెద్ద పనులు ఆశించడం వ్యర్థమే. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఐదో వరుసలో కూర్చునేలా చేయడం ద్వారా మోదీ తన ఫ్రస్ట్రేషన్‌ను చాటుకున్నారు.’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేథ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.