న్యూఢిల్లీ, మార్చి 21: గతంలో ఓ పెద్దమనిషి నేను నిద్రపోను.. పోనివ్వను అని డంబాలు పోయేవాడు. ఆ సంగతేమోగానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అసలే నిద్రపోకుండా పనిచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారట. ప్రస్తుతం రోజుకు రెండే గంటలు నిద్రపోతూ దేశం కోసం పని చేస్తున్నారట. అదీ మానేసి పూర్తికాలం దేశసేవకే అంకితమవుతారట. ఈ ఆణిముత్యాలు ఎక్కడివంటారా? బీజేపీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఇటీవల కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేయడంలో కమలనాథులు కొత్త పుంతలు తొక్కుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఆయన ప్రస్తుతం రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్నారట. ఆ రెండు గంటలూ మానేసి 24 గంటలూ రెప్పవాల్చకుండా దేశం కోసం పనిచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారట. అయితే ఆ ప్రయోగాలు ఏంటో పాటిల్ చెప్పలేదు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది చర్చనీయాంశమైంది.