న్యూఢిల్లీ: టాటా సంస్థల అధినేత రతన్ టాటా మృతిచెంది నెల రోజులు కావస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ ఆర్టికల్ రాశారు. దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాకు తన వ్యాసంతో నివాళి అర్పించారు. సమాజంలోని అన్ని రంగాలు రతన్ టాటా లేని లోటును ఫీలవుతున్నాయన్నారు. సీజనల్ వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్ ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణం, దాతృత్వం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లు కూడా రతన్ మృతితో విషాదంలో ఉన్నట్లు రాశారు. ఈ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రతన్ మరణం అందర్నీ కలిచివేసిందన్నారు.
యువతకు రతన్ ప్రేరణగా నిలిచారన్నారు. భారతీయ సంప్రదాయాలను ఎందరికో పరిచయం చేశారని, సమగ్రతకు.. సేవకు ఆయన కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. రతన్ నాయకత్వంలో టాటా గ్రూపు కొత్త తీరాలకు వెళ్లిందన్నారు. విశ్వాసం, గౌరవం, నమ్మకాన్ని ఆ సంస్థ పొందిందన్నారు. సాధించిన ఘనతల పట్ల ఆయన వినయంగా ఉండేవారన్నారు. మరొకరి ఆశయాలకు మద్దతు ఇవ్వడం ఆయన ఉత్తమ లక్షణమన్నారు. భారత్‌లో స్టార్టప్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంతో రతన్ టాటా మెంటర్‌గా వ్యవహరించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. స్టార్టప్‌లకు ఊతం ఇవ్వడం వల్ల.. ఆవిష్కరణలు, పారిశ్రామీకరణల్లో కొత్త సంస్కృతి ఏర్పడిందన్నారు. రతన్ చూపిన పాజిటివ్ సంకేతం .. రాబోయే దశాబ్ధాల్లో ఇండియాను మరింత తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
ప్రపంచస్థాయికి తగ్గట్లుగా బెంచ్‌మార్క్‌లను సెట్ చేయాలని భారతీయ వ్యాపారవేత్తలను రతన్ ప్రోత్సహించినట్లు ప్రధాని తన వ్యాసంలో వెల్లడించారు. ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించడంలో.. రతన్ విజన్.. భారత భవిష్యత్తు నాయకులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని ఆశించారు. బోర్డురూమ్లకో లేక మనుషులకు సాయం చేయడమే కాదు.. ఆయన గొప్ప జంతు ప్రేమికుడు అని కూడా తెలిపారు. రతన్ తన శునకానికి చెందిన ఫోటోను ఎప్పుడూ అప్డేట్ చేసేవారన్నారు. గొప్ప నాయకుడిని తన సక్సెస్‌ను బట్టి అంచనా వేయడం కాదు అని, ఆ వ్యక్తి నిస్సహాయులను ఆదుకున్న సామర్థ్యాన్ని బట్టి అంచనా వేస్తారన్నారు.
అత్యంత క్లిష్ట సమయాల్లో రతన్ టాటా తనలోని దేశభక్తిని చాటారన్నారు. కోట్లాది మంది భారతీయుల ఆ దేశభక్తిని ప్రత్యక్షంగా తిలకించినట్లు చెప్పారు. ముంబై దాడుల తర్వాత తాజ్ హోటల్ రీఓపెన్ చేసిన తీరు దేశానికి మేలుకొలుపు వంటిదన్నారు. భారత్ ఐక్యంగా ఉన్నదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ప్రదర్శించినట్లు మోదీ తెలిపారు.
రతన్ వ్యక్తిగతంగా తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసు అని, గుజరాత్లో కలిసి పనిచేశామన్నారు. అక్కడ ఆయన ఎన్నో ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం స్పెయిన్ ప్రెసిడెంట్‌తో కలిసి వడోదరలో సీ-295 విమాన తయారీ కాంప్లెక్స్‌ను ఓపెన్ చేసినట్లు తెలిపారు. రతన్ టాటానే ఆ కాంప్లెక్స్ గురించి ప్లాన్ వేశారన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ ఓపెనింగ్ సమయంలో రతన్ లేకపోవడం శోచనీయమన్నారు.
రతన్ టాటా తనకు రెగ్యులర్‌గా లేఖలు రాసేవారన్నారు. ప్రభుత్వ పాలన అయినా లేక శుభాకాంక్షల సందేశాలైనా.. ఆయన క్రమంగా లేఖలు రాసేవారని ప్రధాని తెలిపారు. తమ సర్కారు చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు రతన్ టాటా మంచి సపోర్టు ఇచ్చినట్లు తెలిపారు. దేశ ప్రగతిలో పరిశుభ్రత, స్వచ్ఛత, శానిటేషన్ చాలా కీలకమైనవని రతన్ నమ్మేవారన్నారు. హెల్త్‌కేర్ అంశంలోనూ ఆయన రాజీలేని పోరాటం చేశారన్నారు. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా అస్సాంలో అనేక ఆస్పత్రులను ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఆరోగ్యం, క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి తెవాలన్న ఆశయం రతన్లో ఉన్నట్లు తెలిపారు. భారత్‌ను ఉత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దిన ఆయన పట్ల రాబోయే తరాలు కృతజ్ఞతతో ఉంటారన్నారు.