రామేశ్వరం, ఏప్రిల్ 6: తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలిపే పాంబన్ సముద్ర వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం-తాంబరం రైలు, ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే కోస్ట్‌గార్డ్ నౌకను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. కాగా, రూ.550 కోట్లతో 2.09 కిలోమీటర్ల పొడవున సముద్రంపై నిర్మించిన ఈ బ్రిడ్జి దేశంలోనే తొలి వర్టికల్ సీ లిఫ్ట్ వంతెన.
రాష్ట్రంలో 8,300 కోట్లకు పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తమిళ మాధ్యమంలో వైద్య విద్యను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ర్టానికి చెందిన కొంతమంది నేతలు పంపే లేఖలలో వారి సంతకాలు తమిళంలో ఉండని విషయాన్ని గుర్తించినట్టు ఆయన ఎవరి పేరును ప్రస్తావించకుండా పేర్కొన్నారు. కనీసం మీ సంతకాలైనా తమిళంలో పెట్టండని ఆయన కోరారు.
పార్లమెంట్ నియోజకవర్గాలు పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు ప్రజలకు ఉన్న భయాన్ని ప్రధాని మోదీ తొలగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు. తమిళనాడు హక్కులకు భంగం కలిగించమని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని ఆమోదించాలని ఆయన కోరారు. ఉదగమండంలోని పలు అభివృద్ధి పనులు, పథకాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ గురించి అడిగే హక్కు తమకు ఉందని ఆయన అన్నారు.