న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. ఎన్నికల ప్రసంగాల్లో ‘మందిర్’ అని 421 సార్లు, ‘మోదీ’ అని 758 సార్లు ఆయన ప్రస్తావించారని విమర్శించారు. పాకిస్తాన్, మైనారిటీల గురించి 224 సార్లు అన్నారని గుర్తు చేశారు. అయితే ఒక్కసారి కూడా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మోదీ ప్రస్తావించలేదని దుయ్యబట్టారు.
లోక్సభ ఎన్నికల చివరి విడత ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. దీనికి ముందు మీడియాతో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. ‘బీజేపీ, ప్రధాని మోదీ ప్రచారాన్ని పరిశీలిస్తే గత 15 రోజుల్లో కాంగ్రెస్ గురించి 232 సార్లు ఆయన ప్రస్తావించారు. తన సొంత పేరు మోదీని 758 సార్లు ప్రస్తావించగా, 573 సార్లు భారత కూటమి, ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడారు. కానీ ఒక్కసారి కూడా ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి మాట్లాడలేదు. ముఖ్యమైన విషయాలను పక్కనబెట్టి ప్రచారంలో తన గురించి మాత్రమే ఆయన మాట్లాడారని దీని ద్వారా తెలుస్తోంది’ అని విమర్శించారు.
కాగా, గాంధీజీ అహింసా రాజకీయాలను ఆచరించారు తప్ప ద్వేషాన్ని కాదని ఖర్గే అన్నారు. అయితే మోదీ రాజకీయాలు ద్వేషంతో నిండిపోయాయని విమర్శించారు. కులం, మతం పేరుతో ప్రచారాన్ని ఎన్నికల నిఘా సంస్థ నిషేధించినప్పటికీ ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రజల మధ్య విభజన సృష్టించేలా మాట్లాడిన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఈసీ వ్యవహరించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జూన్ 4 నాటి ఫలితాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలు తీరిగ్గా గాంధీ పుస్తకాలు చదివి ఆ మహాత్ముడి గురించి తెలుసుకోవచ్చని ఎద్దేవా చేశారు.