న్యూఢిల్లీ, మార్చి 27 : పశ్చిమాసియా ఘర్షణల కారణంగా తలెత్తిన ప్రపంచ పరిస్థితి నిరంతరం మారుతూనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ఇంధన భద్రతను నిర్ధారించడం, పరిశ్రమలను, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం వంటివి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. శుక్రవారం ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని ఈ పరిస్థితికి నిరంతర పర్యవేక్షణ, అనుకూల వ్యూహాలు అవసరమని అన్నారు.
కేంద్రం, రాష్ర్టాల మధ్య నిరంతరం సమాచార మార్పిడి, సమన్వయం జరగాలని ఆయన పిలుపునిస్తూ సకాలంలో సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రతిస్పందనలు వేగవంతంగా జరిగేలా చూడాలని కోరారు. కొవిడ్-19 కాలంలో సమిష్టి స్పందనను గుర్తు చేస్తూ సరఫరా గొలుసులు, వాణిజ్య, రోజువారీ జీవితంపై ఎటువంటి ప్రభావం పడకుండా టీమ్ ఇండియాగా కేంద్రం, రాష్ర్టాలు కలసి పనిచేశాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి అదే సహకార, సమన్వయ స్ఫూర్తి భారత్కు గొప్ప బలమని ప్రధాని చెప్పారు.