పుణె, సెప్టెంబర్ 26: దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు. వాతావరణం, వాతావరణ పరిశోధనపై రూ.850 కోట్లతో ఏర్పాటుచేసిన కంప్యూటింగ్ వ్యవస్థను, శాస్త్రీయ పరిశోధన కోసం రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్కతాలలో ఏర్పాటుచేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. కుంభవృష్టి, వేడి గాలు లు, తుఫాన్లు, భారీ వర్షం, వడగండ్ల వాన, కరువు పరిస్థితుల్ని అంచనా వేసేందుకు పుణె, నోయిడాల్లో అత్యంత శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలను తీసుకొచ్చారు.
‘రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వెనుకాడదు’
ముంబై, సెప్టెంబర్ 26: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు మోదీ సర్కార్ వెనుకాడబోదని, దీనిపై బీజేపీ వర్గాలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయని కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకున్నా.. రిజర్వేషన్లను దెబ్బతీయడానికి మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నదని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపడుతుందని అన్నారు.
ఇంద్రసేనారెడ్డికి మిజోరాం గవర్నర్గా అదనపు బాధ్యతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తేతెలంగాణ): త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేనారెడ్డికి మిజోరాం రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సెలవుపై వెళ్లడంతో ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చారు.