PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. కోల్‌కతా ఎయిర్పోర్ట్ నుంచి తహేర్పూర్లో హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. అయితే, భారీ పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సాధ్యం కాలేదు. భారీగా పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గడంతో హెలికాప్టర్ కొద్దిసేపు అదే ప్రాంతంలో చక్కర్లు కొట్టి తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి వెళ్లాల్సి వచ్చింది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయడంతో పాటు బీజేపీ పార్టీ సభలో పాల్గొనాల్సి ఉంది. ప్రధాని వర్చువల్‌గా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం 10.40 గంటలకు కోల్‌కతా చేరుకున్నారు. అక్కడి నుంచి తహేర్పూర్కు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.
పలు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి, బీజేపీ పార్టీ పరివర్తన్ సంకల్ప్ సభలో ప్రసంగించాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సభ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధానమంత్రి సుమారు రూ. 3,200 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయాల్సి ఉంది. నదియా జిల్లాలోని జాతీయ రహదారి-34లో 66.7 కిలోమీటర్ల పొడవు గల బర్జగులి-కృష్ణానగర్ సెక్షన్‌ను నాలుగు లేన్లుగా విస్తరించాల్సి ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని 17.6 కిలోమీటర్ల పొడవైన బరసత్-బర్జగులి సెక్షన్‌ను నాలుగు లేన్లుగా విస్తరించడానికి ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు కోల్‌కతా-సిలిగురి మధ్య కీలకమైన కనెక్టివిటీని మెరుగుపరుచడంతో పాటు దక్షిణ-ఉత్తర ప్రాంతాల్లో వాణిజ్యం, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని అధికారులు తెలిపారు.