ఇంఫాల్: జాతి వైషమ్యాలతో రెండేండ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు శనివారం సందర్శించారు. అయితే ప్రధాని రాకపై విపక్షాల నుంచి భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. చారిత్రక కాంగ్లా ఫోర్ట్‌కు భారీ సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు బీజేపీ నేతృత్వంలోనే మణిపూర్ దగ్ధమైందని, మత రాజకీయాలకు స్వస్తి పలకాలని నినదించారు. పలువురు విపక్షాల కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు వారి కార్యాలయాలలోనే నిర్బంధించారు.
మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు చురాచాంద్‌పూర్‌లో నివాసాలు కోల్పోయిన బాధితులను ప్రధాని పరామర్శించారు. శాంతిని నెలకొల్పడానికి కేంద్రం తోడ్పాటు అందిస్తుందని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. రూ.7 వేల కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.