PM Modi | బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీ భద్రతలపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ అనతరం ఎర్రకోటపై జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్ పొరుగు దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని భారత్ కోరుకుంటుందని.. అక్కడ పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. అలాగే అక్కడి హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని.. మన పొరుగు దేశం సుఖశాంతుల బాటలో నడవాలని ఆకాంక్షిస్తున్నారు.
మానవ జాతి సంక్షేమం కోసమే భారత్ ఆలోచిస్తుందన్న ఆయన.. భారత్ తన వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌కు అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా హింసాత్మక దాడులు మరింత ఎక్కువయ్యాయి. రాజీనామా అనంతరం ఆమె భారత్‌కు చేరుకున్నారు. హిందువులతో పాటు మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఆలయాలపై సైతం దాడులకు తెగబడుతూ దోచుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.