Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కర్ణాటక అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ ప్రధాని మోదీని సొంత పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ నిలదీయటం చర్చనీయాంశంగా మారింది. ‘పదే పదే రాష్ర్టానికి వస్తున్న మోదీ గారూ.. రాష్ర్టాభివృద్ధికి కేంద్రం ఏం చేసింది? మీరు చేసిన మేలు ఏంటో చెప్పండి’ అని ప్రశ్నించడం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీని ఇరుకున పెట్టింది. ‘రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏం చేశారో ముందు చెప్పి.. అప్పుడు ఓట్లు అడగండి’ అంటూ సొంత పార్టీ ఎమ్మెల్సీనే నిలదీయడంతో ఏ తీరున స్పందించాలో అర్థం కాక బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
శనివారం ఎమ్మెల్సీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ రాష్ర్టానికి వచ్చినప్పుడు బడా హామీలు ఇస్తారని, అయితే వాటి అమలులో మాత్రం శూన్య హస్తం చూపిస్తారని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఎన్ని సార్లు పర్యటించినా, ప్రదక్షిణలు చేసినా.. బీజేపీకి సొంతంగా అధికారం దక్కే పరిస్థితి లేదని విశ్వనాథ్ అన్నారు. ఇతర దక్షిణాది రాష్ర్టాల్లోనూ కమలం పార్టీకి అధికారం కలేనని అన్నారు.
బీజేపీ ఇప్పటి వరకు సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, జేడీఎస్ లేదా తన వంటి వారి సాయంతో మాత్రమే సర్కార్ను ఏర్పాటు చేయగలిగిందని విశ్వనాథ్ పేర్కొన్నారు. కాగా, ఇదే సమయంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతల ప్రచార శైలిని ఎమ్మెల్సీ విశ్వనాథ్ విమర్శించారు.
కాంగ్రెస్ పాలన ఎప్పుడూ 85 శాతం కమీషన్లతో ముడిపడి ఉన్నదని, ఆ పార్టీ రాజ కుటుంబం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి బెయిల్పై ఉన్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరేవని కాంగ్రెస్ అగ్రనేతలు గర్వంగా చెబుతుండేవారని ప్రధాని ఆరోపించారు.