హైదరాబాద్, ఆగస్టు 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు 56 అంగుళాల ఛాతీ చిన్నబోయింది. తమపై టారిఫ్‌లు వేసిన ట్రంప్‌ను మిగతా దేశాలు చీల్చి చెండాడుతున్నప్పటికీ, భారత ప్రధాని మోదీ మాత్రం మౌన ముద్రనే ఆశ్రయిస్తున్నారు. భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల వాత విధించినా, డెడ్ ఎకానమీ అని అవహేళన చేసినా, పాక్ చమురును కొనే రోజులు వస్తాయని ఇండియాను తక్కువ చేసినా ప్రధాని నోరు మాత్రం పెగలట్లేదు. చివరకు.. ‘ట్రంప్ సుంకాలపై ప్రతీకార చర్యలు ఉంటాయా?’ అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ..అలాంటిదేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొనడాన్ని చూస్తే.. ట్రంప్ ముందు మోదీ జీహుజూర్ అయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ సహా మొత్తం 69 దేశాలపై ట్రంప్ సుంకాలను విధించారు. అమెరికా అధ్యక్షుడి ఏకపక్ష చర్యలను తప్పుబడుతూ పలు దేశాలు గట్టిగానే కౌంటర్ ఇచ్చాయి. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా తీవ్రంగా స్పందించారు. ‘ప్రపంచం మునుపటిలా లేదు. ఎంతో మారిపోయింది. కాబట్టి ఇప్పుడు చక్రవర్తి అవసరం లేదు. ట్రంప్ సుంకాలు విధిస్తే, ఇతర దేశాలకూ ఆ హక్కు ఉంది. సుంకాల పేరిట సోషల్ మీడియాలో ట్రంప్ చేస్తున్న బెదిరింపులు ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’ అంటూ ఘాటుగా స్పందించారు.
ఇక, తమ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా పోల్చడంపై రష్యా కూడా ట్రంప్‌పై గట్టిగానే మండిపడింది. ‘డెడ్ హ్యాండ్ చాలా డేంజర్.. దాంతో జాగ్రత్త. సోవియట్ కాలం నాటి ఆటోమేటిక్ అణ్వాయుధ సామర్థ్యాలను రష్యా ఇంకా కలిగి ఉందన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు గుర్తుంచుకోవాలి’ అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ ధ్వజమెత్తారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలను ట్రంప్ హెచ్చరించడంపై చైనా స్పందించింది. వాస్తవానికి రష్యాతో అమెరికానే వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నదని, ఇతరులపై నిందలు వేసి బలిపశువులను చేయడం ఇప్పటికైనా మానుకోవాలని అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలోని చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ ట్రంప్‌నకు హితవు పలికారు.
తమపై సుంకాలు విధిస్తూ.. నోరు పారేసుకొంటున్న ట్రంప్‌పై మిగతా దేశాలు గట్టిగా బదులిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇప్పటివరకూ ట్రంప్ వ్యాఖ్యలపై, ఆయన విధించిన సుంకాలపై ఏ విధంగానూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. రష్యా-భారత్‌లను ఉద్దేశిస్తూ ట్రంప్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకొన్నా తనకు సంబంధం లేదన్న ట్రంప్.. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. ఇక, పాకిస్థాన్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి చెప్తూ.. భారత్‌పై నోరు జారారు. భవిష్యత్తులో భారత్‌కు పాక్ చమురు విక్రయించవచ్చంటూ ఊహాగానాలు చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, మోదీ ఖండించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.
‘మిత్ర దేశమంటూనే 25 శాతం సుంకాలు విధించిన అమెరికాపై ఇండియా కూడా ప్రతీకార చర్యలు తీసుకొంటుందా?’ అని మీడియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ వర్గాలను సంప్రదించాయి. అయితే, ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం మౌనమే తమ సమాధానమని, చర్చల ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపాయి. అయితే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వలసల పేరిట సంకెళ్లు వేసి భారతీయులను ట్రంప్ ఇక్కడికి పంపించినప్పుడు కూడా ట్రంప్ వైఖరిపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తుతున్నారు. గత ఫిబ్రవరిలో మోదీ స్వయంగా అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో చర్చించినప్పటికీ, సుంకాల వాత తప్పలేదని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ట్రంప్‌నకు ‘జీ హుజూర్’ అన్న రీతిలో మోదీ సర్కారు వ్యవహారం ఉన్నదని మండిపడుతున్నారు.