ఓస్లో: నార్వేకు చెందిన అఫ్టెన్‌పోస్టన్ అనే పత్రిక వివాదాస్పద కార్టూన్ వేసింది. ప్రధాని మోదీని పాములు ఆడించే వ్యక్తిగా తన కార్టూన్(Modi Cartoon)లో చిత్రీకరించింది. అఫ్టెన్‌పోస్టన్ ఆ దేశంలో అత్యధికంగా సర్క్యూలేషన్లో ఉన్న పత్రిక. ప్రస్తుతం ప్రధాని మోదీ యూరోప్ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నార్వేకు చెందిన ప్రముఖ పత్రిక.. ప్రధాని మోదీని పాములు ఆడించే వ్యక్తిగా తన కార్టూన్లో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. స్నేక్ చార్మర్ అన్న రీతిలో మోదీని ప్రజెంట్ చేయడం పట్ల సోషల్ మీడియా యూజర్లు రియాక్ట్ అవుతున్నారు. నార్వే తన జావివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించారు. బ్రిటీషు వలసవాదుల తరహాలో నార్వే వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఓస్లోలో మోదీ పర్యటిస్తున్న సందర్భంగా ఆ కార్టూన్ వేశారు. ఆ కార్టూన్‌కు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఓ తెలివైన , తికమకపెట్టే వ్యక్తి అన్న ఉద్దేశంతో వచ్చేలా కామెంట్ చేశారు. నార్వే పత్రిక వేసిన కార్టూన్లో మోదీ పుంగీ ఊదుతుండగా, బుట్టలో ఉన్న పాము లేచి ఆడుతోంది. అయితే ఆ పామును ఓ గ్యాస్ స్టేషన్ ఫిల్లింగ్ పైప్‌గా కార్టూన్లో చిత్రీకరించారు.
ఇక ఓ డిప్లమాటిక్ మీటింగ్‌లో మోదీని ప్రశ్న వేసిన జర్నలిస్టు హెల్లి లింగ్ .. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో కొందరు విమర్శకులు నార్వే తీరును తప్పుపట్టారు. దేశాధినేతలను తమ కార్టూన్లతో వివాదాస్పద రీతిలో చిత్రీకరించి, తమ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉన్నట్లు చెప్పుకుంటారని ఆరోపించారు. భారత్ అనగా పాములు పట్టే వ్యక్తులను చూపిస్తూ గతంలోనూ పాశ్చత్య దేశాలు వివాదాస్పద రీతిలో వ్యవహరించాయి. తాజా ఘటన కొలోనియల్ మైండ్‌సెట్‌ను స్పష్టం చేస్తున్నదని కొందరు ఆరోపించారు.