న్యూఢిల్లీ: తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. తనపై గెలవాలంటే తన నిజాయితీపై దాడి చేయాలని మోదీ భావించారంటూ మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ మాపై కుట్ర పన్నారు. నన్ను, (ఆప్ నేత) మనీష్ సిసోడియా అవినీతిపరుడని నిరూపించేందుకు కుట్ర పన్నారు. మా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు’ అని అన్నారు.
కాగా, తాను గత పదేళ్లుగా నిజాయితీతో ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపానని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తనపై గెలవాలంటే తన నిజాయితీపై దాడి చేయాలని ప్రధాని మోదీ భావించారని విమర్శించారు. ‘సీఎం కుర్చీపై ఆకలి లేకపోవడం వల్లే రాజీనామా చేశా. డబ్బు సంపాదించడానికి కాదు, దేశ రాజకీయాలను మార్చేందుకే వచ్చా’ అని అన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన తాను మరికొద్ది రోజుల్లో సీఎం అధికార నివాసం నుంచి వెళ్లిపోతానని తెలిపారు. పదేళ్లపాటు సీఎంగా ఉండి కూడా ఢిల్లీలో తనకు సొంత ఇల్లు లేదన్నారు.
మరోవైపు బీజేపీ తనను అవినీతిపరుడని అనడంతో బాధపడ్డానని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీ లేనివాడైతే ప్రజలకు ఉచిత విద్యుత్తు, మహిళలకు బస్సు చార్జీలు ఉచితంగా ఇచ్చేవాడా? పిల్లల కోసం స్కూళ్లు కట్టించేవాడా? ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా అందించేవాడా? ’ అని ప్రశ్నించారు. 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, వారు ఏ రాష్ట్రంలోనైనా ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారా? అని నిలదీశారు. ‘నేను దొంగనా? లేదా కేజ్రీవాల్‌ను జైలుకు పంపిన వ్యక్తులు దొంగలా?’ అని ప్రశ్నించారు.
#WATCH | AAP national convenor Arvind Kejriwal says, “For the last ten years, we were running the government honestly, we made electricity and water free, made treatment free for people, made education excellent… Modi ji started thinking that if he wanted to win against them, he… pic.twitter.com/drUELL6ZGq
— ANI (@ANI) September 22, 2024