Narendr Modi | దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో వైద్య రంగాన్ని మరింత పరిపుష్టం చేయాలని, కావాల్సిన సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
టీనేజర్లకు (15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి) ఇస్తున్న వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, ఈ అంశాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని నొక్కి వక్కాణించారు. టీనేజర్ల వ్యాక్సినేషన్‌ను ఓ మిషన్‌గా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. కేసులు బాగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి, ప్రత్యేక దృష్టి నిలపాలన్నారు. ఇలాంటి రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని కూడా త్వరిత గతిన అందించాలని మోదీ అధికారులను ఆదేశించారు.
కరోనా పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా టెస్టులు, ఒమిక్రాన్ టెస్టులతో పాటు వ్యాక్సినేషన్‌పై కూడా దృష్టి నిలపాలని మోదీ అధికారులకు సూచించారు. వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూనే వుందని, అందుకే వ్యాక్సిన్లు, ఔషధ రంగం, జినోమ్ సీక్వెన్సింగ్‌లో నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉండాలని మోదీ ఆకాంక్షించారు.
ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోమారు సమావేశం కావాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు, వైద్య రంగంలో సదుపాయాలు, రాష్ట్రాల అవసరాల గురించి చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎంలతో ఏ రోజు సమావేశం అవుతారన్నది మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. మరోవైపు కోవిడ్ యేతర రోగాలపై కూడా దృష్టి నిలపాలని, వాటిని నిర్లక్ష్యం చేయవద్దని మోదీ అధికారులను ఆదేశించారు.