PM Modi : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులను అదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. బుధవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌లో పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న ఉన్నావ్ పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను బస్సు నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా గాయపడిన వారు బంగార్మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.