PM Modi : రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ప్రమాదం హృదయ విదారకం’ అని పేర్కొన్నారు. మృతుల్లో అమాయక చిన్నారులు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
ఆదివారం ఉదయం రాజస్థాన్లోని గుమత్ మొహల్లాకు చెందిన కొందరు సర్ముతురా ప్రాంతంలోని బరౌలీలో ఓ వివాహ వేడుకలో పాల్గొని టెంపోలో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ బస్సు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 10 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. కాగా ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.