
న్యూఢిల్లీ: అంధులు రూ.50 నోటును వినియోగించడంలో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నోటును ఉపసంహరించుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూ.100, రూ.500 నోట్ల లాగే రూ.50 నోటు ఉందని, దీంతో ఆ నోటును గుర్తుపట్టలేకపోతున్నారని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రోహిత్ డాండ్రియాల్ వాపోయారు. అంధులు వినియోగించేందుకు వీలుగా రూ.50 నాణేన్ని విడుదల చేసేలా కేంద్రం, రిజర్వ్ బ్యాంకుకు సూచించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అప్పుడు అంధులు కూడా అందరితో పాటు సమానమైన అవకాశాలు పొందడానికి, వ్యాపారం సులువుగా చేసుకునే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. దీనిపై 2022 ఫిబ్రవరి 25న విచారణ జరుగుతుందని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్ వెల్లడించారు.