న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్లాస్టిక్ వాడకంతో ఏర్పడుతున్న కాలుష్యం ప్రపంచానికి పెను ముప్పుగా మారింది. కేవలం ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం కోసం ప్రతి ఏటా జరుగుతున్న వ్యయం 1.5 ట్రిలియన్ డాలర్లు (సుమారుగా రూ.131 లక్షల కోట్లు)గా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘ద లాన్సెట్ మెడికల్ జర్నల్’ కథనం ప్రకారం, బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వ్యాధులు, మరణాలకు ప్లాస్టిక్ కాలుష్యం కారణమని నివేదిక గుర్తించింది.
ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక నష్టాలకు దారితీస్తున్నదని హెచ్చరించింది. ప్రకృతిలో, మానవ శరీరంలో మైక్రోప్లాస్టిక్ చేరుతుండటంపై పలు నివేదికలు ఇప్పటికే హెచ్చరించాయని తెలిపింది. ఏటా ఎన్నో వేల మంది మరణానికి ప్లాస్టిక్ కాలుష్యం కారణమని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ ఫిలిప్ లాండ్రిగాన్ అన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడంపై తొలి సదస్సు త్వరలో జెనీవాలో మొదలుకానున్నది.