Moon | న్యూఢిల్లీ: వినీలాకాశంలో వెండి వెన్నెల కురిపించే చంద్రుడు దాదాపు 400 కోట్ల సంవత్సరాల నుంచి భూమికి ఖగోళ సహచరుడిగా కొనసాగుతున్నాడు. సహజసిద్ధమైన ఈ ఉపగ్రహం ఓ భారీ విపత్తు వల్ల ఆవిర్భవించిందన్న మాట చాలా కాలం నుంచి వినిపిస్తున్నది.
దాదాపు అంగారక గ్రహమంత పరిమాణంలో ఉన్న ‘థియా’ అనే ప్రొటో గ్రహం భూగోళాన్ని ఢీ కొనడం వల్ల చంద్రుడు ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి చెప్తున్నారు. దీర్ఘకాలం నుంచి మనుగడలో ఉన్న ఈ సిద్ధాంతాన్ని తాజా పరిశోధన సవాల్ చేసింది. చంద్రుని ఆవిర్భావం ఎలా జరిగిందో నిగ్గు తేల్చాలన్న లక్ష్యంతో గొట్టింగెన్ యూనివర్సిటీ, మాక్స్ ప్లాంక్ సోలార్ సిస్టమ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.