Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం ప్రస్తుతం మూతపడింది. కార్యకలాపాలన్నీ నిలిపివేశారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను తరలించడానికి రైల్వేలు ప్రత్యేక ఏసీ రైళ్లను నడిపించనున్నాయి. ఈ రైళ్లు ముంబయి, ఢిల్లీకి నడవనున్నాయి. ఓ రైలు రాత్రి 11.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నది. మరో రైలు అర్ధరాత్రి 12 గంటలకు అహ్మదాబాద్ నుంచి ముంబయికి వెళ్తుంది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో 8వది. ప్రతిరోజూ సగటున 250 విమానాలు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. ఈ విమానాశ్రయం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎయిర్ ఇండియా విమానం సర్దార్ వల్లభాయ్ విమానాశ్రయం సమీపంలోనే కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మెడికల్ కాలేజీ భవనంపై పడిపోయింది. ఈ క్రమంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు విమానాశ్రయంలో సేవలు నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులందరూ తమ తమ విమానయాన సంస్థలతో నిరంతరం టచ్‌లో ఉండాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నట్లు పేర్కొంది. ఏదైనా సమాచారం అందిన వెంటనే పంచుకుంటామని పేర్కొంది. ప్రమాదం ఘటన గురించి తెలుసుకున్న వెంటనే విజయవాడలో ఉన్న కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుకుడు అహ్మదాబాద్ చేరుకున్నారు. డీజీసీఏ, ఏఏఐ, ఎన్డీఆర్ఎఫ్, గుజరాత్ ప్రభుత్వ సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డైరెక్టర్ జనరల్ దర్యాప్తు కోసం బృందంతో అహ్మదాబాద్‌కు బయలుదేరింది. ప్రమాదానికి గురైన విమానం గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరి రెండు నిమిషాల తర్వాత 1.40 గంటలకు కూలిపోయింది. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒకరు కెనడియన్ పౌరుడు ఉన్నారు. ఇందులో ఎవరూ బతికేందుకు అవకాశాలు లేవని.. ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్ అధికారులు తెలిపారు.