Pintu Mahara : అతనొక రౌడీషీటర్ (Rowdy sheeter)..! అతని పేరు పింటూ మహరా (Pintu Mahara)..! అతనిపై హత్యలు (Murders), బలవంతపు వసూళ్లు (Extortion) సహా మొత్తం 12 కేసులున్నాయి..! అతడి తండ్రి కూడా నేరస్థుడే..! ఆయన నేరాలు చేస్తూ చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు..! పింటూ సోదరుడు కూడా రౌడీ షీటరే..! అంటే అతని కుటుంబం మొత్తానికి నేరచరిత్ర ఉంది..! అలాంటి వ్యక్తి ఈ మధ్య బెయిల్పై జైలు నుంచి బయటికి వచ్చాడు..! కేవలం 45 రోజుల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడకుండా ఏకంగా రూ.30 కోట్లు సంపాదించాడు..! మరి అదెలా సాధ్యమైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమంలో ఇటీవల 45 రోజులపాటు కుంబమేళా కొనసాగింది. ఈ కుంభమేళాలో పడవల యజమాని అయిన పింటూ మహరా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మందిని తన పడవల ద్వారా గమ్య స్థానాలకు చేర్చారు. కుంభమేళా జరిగిన 45 రోజులు పడవలను నడపడం ద్వారా ఆయన ఏకంగా రూ.30 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వయంగా అసెంబ్లీలో వెల్లడించాడు. పింటూను విజేత అని ప్రశంసించారు.
అయితే పింటూ విజయం వెనుక చాలా రిస్క్ ఉందట. కుంభమేళాకు ముందు అతని దగ్గర కేవలం 60 పడవలు మాత్రమే ఉండేవట. కానీ కుంభమేళా కోసం అతను మరో 70 పడవలు సిద్ధం చేసుకున్నాడు. దాంతో అతని మొత్తం పడవల సంఖ్య 130కి చేరింది. అందుకు పెద్దఎత్తున ఖర్చయ్యింది. భారీగా అప్పులు తీసుకొచ్చి మరీ ఆ పడవలు కొన్నాడు. ఇంట్లో బంగారం మొత్తం తాకట్టు పెట్టాడు. 2019లో జరిగిన అర్ధకుంభమేళాలో అతని దగ్గరున్న పడవలు సరిపోలేదట. దాంతో మహాకుంభమేళాకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి, ఖర్చుకు మించిన ఆదాయం తప్పకుండా వస్తుందనే ధైర్యంతో పడవలను భారీగా పెంచుకున్నాడట.
ఈ కుంభమేళా సందర్భంగా పింటూ భారీగా సంపాదించుకోవడమే కాదు.. మొత్తం 300 మంది యువతకు ఉపాధి కల్పించాడు. కొడుకు పింటూ విజయంపై ఆయన తల్లి స్పందించారు. కుంభమేళాకు ముందు తమకు ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడిగా పెట్టామని, ఆ గంగమ్మ తల్లి తమ మొర ఆలకించిందని చెప్పారు.