Pinarayi Vijayan | తిరువనంతపురం, మార్చి 5 : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇటీవలి ఢిల్లీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి దోహదం చేసిందని ఆయన ఒక వ్యాసంలో ఆరోపించారు. తమ పార్టీ మాత్రమే సంఘ్ పరివార్ను వ్యతిరేకిస్తున్నదని కాంగ్రెస్ చెప్పుకుంటున్నదని, కానీ ఇందులో నిజమెంత? అని ఆయన ప్రశ్నించారు. ‘హర్యానా, రాజస్థాన్, పంజాబ్, యూపీ, మహారాష్ట్రల్లో కేంద్రం విధానాలపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహం లోక్సభ, తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబించింది కూడా. అయినప్పటికీ ఆ రాష్ర్టాలలో బీజేపీని అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ వైఖరే అన్నది విస్పష్టం. ఉనికిలో లేని శక్తిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ లౌకిక ఓట్ల ఏకీకరణను నిరోధించింది’ అని విజయన్ తప్పుబట్టారు. బీజేపీని ఓడించాలన్న వారి ఆశలను కాంగ్రెస్ వమ్ము చేసిందని విమర్శించారు.
బలం లేకపోయినా పోటీ చేస్తూ బీజేపీకి మేలు చేస్తున్న కాంగ్రెస్ను ఇతర లౌకిక పార్టీలు నమ్ముతాయా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అనుసరించిన సెక్యులర్ ఓట్లను విభజించే విచ్ఛిన్న వ్యూహం బీజేపీకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అధికారాన్ని కట్టబెట్టిందని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే ఇతర ప్రతిపక్ష పార్టీల పట్ల కూడా కాంగ్రెస్ వైఖరి అహంకారపూరితంగా ఉందని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే అక్కడ కాంగ్రెస్ 2015, 2020 నుంచి ఒక్క సీటు కూడా నెగ్గలేదని, తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కింది సున్నా సీట్లేనని అన్నారు. ఆప్తో కలవకుండా పోటీచేసి బీజేపీని గెలిపించాలన్న తన ప్రాథమిక లక్ష్యాన్ని కాంగ్రెస్ నెరవేర్చుకుందని అన్నారు.