ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే(Eknath Shinde) విమానం ప్రయాణం ఆలస్యమైంది. జల్గావ్ నుంచి ముంబైకి వెళ్లాల్సిన వ్యక్తిగత విమానం ఆలస్యంగా టేకాఫ్ తీసుకున్నది. విమానాన్ని తోలేందుకు పైలెట్ నిరాకరించడంతో ఆయన కొన్ని గంటలు ఆలస్యంగా వెళ్లారు. డ్యూటీ అవర్స్ ముగిసినందు వల్ల తాను విమానాన్ని నడపబోనని పైలెట్ చెప్పాడు. దీంతో ఖంగుతున్న డిప్యూటీ సీఎం ఆ పైలెట్‌ను ఒప్పించేందుకు తెగ తంటాలు పడ్డారు. ముక్తయినగర్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా పాల్కీ యాత్ర నిర్వహించారు. దాంట్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యేందుకు విమానం వద్దకు వచ్చారు.
వాస్తవానికి జల్గావ్కు సాయంత్రం 3.45 నిమిషాలకు షిండే రావాలి. కానీ రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత కొందరు మంత్రులతో కలిసి ఆయన పాల్కీ యాత్ర ప్రదేశానికి వెళ్లారు. సంత్ ముక్తాయి ఆలయంలో జరిగిన యాత్రలో పాల్గొన్న తర్వాత రాత్రి 9.15 నిమిషాలకు మళ్లీ విమానం వద్దకు వచ్చారు. అయితే ఆ సమయంలో పైలెట్ విమానాన్ని నడిపేందుకు నిరాకరించాడు. తన పని గంటలు ముగిసినట్లు అతను చెప్పాడు. డ్యూటీ అవర్స్ అయిపోయాయని, మళ్లీ పర్మిషన్ తీసుకోవాలంటే సమయం పడుతుందన్నాడు. ఆరోగ్యం సరిగా లేని కారణంగా, విమానాన్ని నడపలేనని ఆ పైలట్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
విమాన పైలెట్‌తో మంత్రులు సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. చివరకు అతన్ని ఒప్పించారు. విమాన క్లియరెన్స్ కోసం సంబంధిత శాఖలతోనూ మాట్లాడారు. ఆ తర్వాత ముంబైకి విమానం ఎగిరింది. అయితే రిటర్న్ ఫ్లయిట్లో.. మంత్రి షిండేతో పాటు ఆయన బృందం ఓ మహిళను రెస్క్యూ చేశారు. ముంబైలో అత్యవసరంగా కిడ్నీ చికిత్సకు వెళ్లాల్సిన మహిళను తమతో తీసుకెళ్లారు. శీతల్ పాటిల్ అనే మహిళ మరో విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ అది మిస్ కావడంతో.. షిండే విమానంలో ఆమె వెళ్లింది. పేషెంట్ రాక సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్టులో అంబులెన్సు సర్వీస్‌లను అందుబాటులో ఉంచారు.