లక్నో: రైళ్లను ప్రమాదాలకు గురి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైలు పట్టాలపై కాంక్రీట్ పిల్లర్‌ను ఉంచారు. (Pillar On Rail Track) గమనించిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశాడు. అక్కడకు చేరుకున్న ఆర్పీఎఫ్, పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. రైలు పట్టాలపై పిల్లర్ ఉంచిన 16 ఏళ్ల బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం బందా – మహోబా మార్గంలోని రైల్వే ట్రాక్‌పై ఫెన్సింగ్ పిల్లర్ ఉన్నది. గమనించిన ప్యాసింజర్ రైలు లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశాడు. స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు.
కాగా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ పిల్లర్‌ను రైలు పట్టాల పైనుంచి తొలగించారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. 16 ఏళ్ల బాలుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పిల్లర్‌ను రైలు పట్టాలపై తాను ఉంచినట్లు ఆ మైనర్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు శనివారం బల్లియా జిల్లాలో కూడా ఇలాంటి తరహా సంఘటన జరిగింది. బైరియా ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన రాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టింది. రాయిని గమనించిన లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేయడంతో ఎలాంటి నష్టం జరుగలేదని రైల్వే అధికారి వెల్లడించారు.