న్యూఢిల్లీ: పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నెల 13న లోక్‌సభలో కొందరు వ్యక్తులు సృష్టించిన అలజడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. న్యాయవాది అబు సొహెల్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఈ నెల 13న సాగర్ శర్మ, డీ మనోరంజన్ లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీల మధ్యకు దూసుకెళ్లి, పసుపు రంగు పొగ బాంబులను విసిరి, కలకలం సృష్టించారు. వారిని కొందరు ఎంపీలు అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో అమోల్ షిండే, నీలం దేవి లోక్‌సభ వెలుపల ఇటువంటి బాంబులను విసిరి, పసుపు రంగు పొగ వ్యాపించేలా చేసి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు లలిత్ ఝా, మహేశ్ కుమావత్ కూడా అరెస్టయ్యారు.