న్యూఢిల్లీ: ప్రైవేటు కంపెనీ ఉద్యోగాల్లో స్థానికులకే వంద శాతం కోటా ఇవ్వాలని కర్నాటక సర్కార్ తాజాగా ఓ బిల్లును రూపొందించింది. దానిపై వ్యాపారవేత్తల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్నాటక సర్కార్ తీసుకురాబోతున్న కోటా బిల్లును ఫోన్‌పే సీఈవో( PhonePe CEO), వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ తప్పుపట్టారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. దేశవ్యాప్తంగా తమ కంపెనీ సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని, అయితే తమ పేరెంట్స్ వేర్వురు నగరాల్లో జీవించారని, మరి ఇలాంటి బిల్లుతో తనకు న్యాయం జరగదని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు.
తన వయసు 46 ఏళ్లు అని, ఒక రాష్ట్రంలో 15 ఏళ్ల కన్నా ఎక్కువగా జీవించలేదని సమీర్ నిగమ్ తెలిపారు. నాన్న ఇండియన్ నేవీలో చేశారని, పోస్టింగ్ రీత్యా దేశం మొత్తం తిరిగారని, ఇప్పుడు ఆయన పిల్లలకు కర్నాటకలో జాబ్స్ రావని సమీర్ తన ట్వీట్లో వెల్లడించారు. కొత్తగా తాను కంపెనీలు స్టార్ట్ చేశానని, దేశమంతా 25వేల ఉద్యోగాలు కల్పించానని, కానీ నా పిల్లలకు మాత్రం స్వంత నగరంలో ఉద్యోగాలు రావని ఆయన అన్నారు.
I am 46 years old. Never lived in a state for 15+ yrs
My father worked in the Indian Navy. Got posted all over the country. His kids don’t deserve jobs in Karnataka?
I build companies. Have created 25000+ jobs across India! My kids dont deserve jobs in their home city?
Shame.
— Sameer.Nigam (@_sameernigam) July 17, 2024
ఏమిటీ నిర్ణయం?
కర్ణాటకలోని అన్ని ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగాల్లో స్థానికులకే 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు కల్పించే బిల్లుకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో సీ, డీ గ్రేడ్ పోస్టులకు సంబంధించి 100 శాతం కన్నడిగులనే నియమించేలా వీలు కల్పించే బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది’ అని సీఎం పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది.
ఈ క్రమంలో తన పోస్ట్‌ను తొలగించిన సిద్ధరామయ్య.. ‘ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 70 శాతం, మేనేజ్మెంట్ పోస్టుల్లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాల’ని తాము నిర్ణయించినట్టు వెల్లడించారు. కర్ణాటకలో పుట్టినవారు, 15 ఏండ్లుగా రాష్ట్రంలో నివసిస్తున్నవారిని స్థానికులుగా గుర్తిస్తారు. కన్నడ భాషలో మాట్లాడుతూ, రాయగలిగినప్పటికీ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ గనుక లేకపోతే.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు.